ఒమ్'అయ్యప్ప' (Ayyappa) హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు